🏠 www.telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2026, 8:58 pm Posted by : TELANGANA PRAJA GARJANA

షాద్‌నగర్‌లో గంజాయి దందా గుట్టురట్టు బీహార్‌ యువకుడి అరెస్ట్‌.. కిలో గంజాయి స్వాధీనం

News Image

తెలంగాణ ప్రజాగర్జన | షాద్‌నగర్‌, అక్టోబర్‌ 27:షాద్‌నగర్‌ పట్టణంలో గంజాయి విక్రయాలపై శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు మెరుపు దాడి చేశారు. గంజాయిని అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ (23)ను అరెస్ట్‌ చేసి, అతడి వద్ద నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఓటీ ఎస్సై శరత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌ రాష్ట్రం ముజఫర్‌పూర్‌ జిల్లాలోని చంగేల్‌ (ఉర్ఫ్‌ మధురాపూర్‌) గ్రామానికి చెందిన సంజయ్‌ కుమార్‌ ఉపాధి కోసం షాద్‌నగర్‌కు వచ్చి, ఆఫీసర్స్‌ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయిని తీసుకొచ్చి షాద్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి నివాసంలో గంజాయి నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా దాడి చేసి, కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎవరెవరికి విక్రయిస్తున్నాడు, ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
🏠 Home