🏠 www.telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 October 2026, 1:47 pm Posted by : TELANGANA PRAJA GARJANA

సైబరాబాద్ కార్మికులకు జీహెచ్‌ఎంసీ వేతనాలు అమలు చేయాలి రెండు నెలల బకాయిలు చెల్లించాలి.. 15 క్యాజువల్‌ సెలవులు కల్పించాలి వనంపల్లి జైపాల్‌రెడ్డి, హరినాథరావు డిమాండ్‌

News Image
తెలంగాణ ప్రజాగర్జన.హైదరాబాద్‌, అక్టోబర్‌ 28: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు జీహెచ్‌ఎంసీ వేతనాలను అమలు చేయడంతోపాటు రెండు నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి వి.హరినాథరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అక్టోబర్‌ 27న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు యూనియన్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. జీహెచ్‌ఎంసీని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని కార్మికులకు జీహెచ్‌ఎంసీ వేతనాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అదే విధానాన్ని సైబరాబాద్ కార్మికులకూ వర్తింపజేసి న్యాయం చేయాలని కోరారు. ఈ సమస్యపై గతంలో అక్టోబర్‌ 3న వినతిపత్రం సమర్పించినా పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. కార్మికులకు రెండు నెలల బకాయిలతో సహా వేతనాలు చెల్లించాలని, జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలవుతున్న ఎనిమిది జాతీయ పండుగ సెలవులు, 15 క్యాజువల్‌ సెలవులను సైబరాబాద్ కార్పొరేషన్‌ కార్మికులకూ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారికి న్యాయంగా అందాల్సిన వేతనాలు, సెలవుల సౌకర్యాలను కల్పించాలని యూనియన్‌ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్‌, ఇతర మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.
🏠 Home