🏠 www.telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 4:25 pm Posted by : TELANGANA PRAJA GARJANA

నకిలీ ఆధార్, పాన్ కార్డులు తయారు చేస్తున్న జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడి అరెస్ట్

News Image
నకిలీ ఆధార్, పాన్ కార్డులు తయారు చేస్తున్న జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడి అరెస్ట్
ఆధార్, పాన్ కార్డుల్లో అనధికారికంగా మార్పులు చేస్తూ నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేస్తున్న వ్యక్తిని శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి శ్రీరామ్ కాలనీకి చెందిన చింతల మహదేవ్ (36) అనే జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.బడ్వేల్‌లోని శ్రీరామ్ నగర్ కాలనీలో ‘కవిత ఏ టు జెడ్ ఆన్‌లైన్ సర్వీసెస్’ పేరుతో జిరాక్స్ సెంటర్ నడుపుతున్న మహదేవ్, ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ల సహాయంతో ఆధార్, పాన్ కార్డుల్లో పేర్లు, ఫొటోలు, పుట్టిన తేదీలు, చిరునామాలను అక్రమంగా మారుస్తున్నాడు. పుట్టిన తేదీ మార్పునకు రూ.300, పూర్తి వివరాల మార్పునకు రూ.700 నుండి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నాడు. ఈ నకిలీ కార్డులను కొందరు ప్రైవేట్ ఉద్యోగాలు, సిమ్ కార్డులు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు తేలింది.
విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.5,000 నగదు, 60 నకిలీ ఆధార్ కార్డులు, 2 పాన్ కార్డులు, ల్యాప్‌టాప్, ప్రింటర్, లామినేషన్ యంత్రం, మొబైల్ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ డి. కృష్ణమోహన్, ఎస్‌ఐలు ఎస్. శేషు, కె. మన్సూర్ అలీ, ఎన్. నర్సింహారావు, టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ సిబ్బంది పాల్గొన్నారు. కేసు వివరాలను టాస్క్‌ఫోర్స్ శంషాబాద్-రాజేంద్రనగర్ జోన్ల అదనపు డీసీపీ కె.ఎస్. రావు వెల్లడించారు.
🏠 Home