🏠 www.telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 12:43 pm Posted by : TELANGANA PRAJA GARJANA

షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, శిశువు మృతి.!

News Image
షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, శిశువు మృతి

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ, కడుపులోని శిశువు మృతి చెందారు. కొందుర్గ్ మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన రాధ (28)ను కుటుంబసభ్యులు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. నార్మల్ డెలివరీ అవుతుందని, కొద్దిసేపు వేచి ఉండాలని వైద్య సిబ్బంది చెప్పడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.అయితే ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వైద్య సిబ్బంది కాలయాపన చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రాధ పరిస్థితి విషమించి నోట్లో నుంచి నురగలు రావడంతో తీవ్రమైన ఫిట్స్ వస్తున్నాయని, ఇక్కడ చికిత్స చేయడం సాధ్యం కాదని చెప్పి హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు. దీంతో ప్రైవేట్ అంబులెన్స్‌కు రూ.9 వేల వరకు చెల్లించి హైదరాబాద్‌కు తరలించగా, అప్పటికే తల్లి, కడుపులోని శిశువు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు, కనీసం భర్తకు సమాచారం ఇవ్వకుండానే పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమకు మృతదేహాన్ని కూడా అప్పగించడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చిన రాధ వైద్యుల నిర్లక్ష్యంతోనే ప్రాణాలు కోల్పోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రాధ మృతిపై షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వివరణ..

షాద్‌నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ రాధ (28), కడుపులోని శిశువు మృతిపై ఆసుపత్రి యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 30న మధ్యాహ్నం 12 గంటలకు తొమ్మిది నెలల గర్భంతో ఆమె ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తీవ్ర ఫిట్స్ రావడంతో ఐదుగురు వైద్యుల బృందం CPR సహా అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయిందని పేర్కొంది. బిడ్డనైనా కాపాడాలనే ఉద్దేశంతో ఉన్నత వైద్య కేంద్రానికి తరలించగా, అక్కడ కూడా శిశువును కాపాడలేకపోయారని విచారం వ్యక్తం చేసింది. ఋతురాలి కుటుంబానికి సానుభూతి తెలిపింది.

l
🏠 Home